Narendra Modi: దూసుకొస్తున్న తుపాను.. తమిళనాడుకు మోదీ అభయహస్తం
- మరో 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'నివర్'
- జాగ్రత్తగా ఉండాలని టీఎన్, పుదుచ్చేరి సీఎంలకు చెప్పిన మోదీ
- కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుందని భరోసా
ఈ ఏడాది ఇప్పటికే తుపానులు, భారీ వరదలతో జనాలు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు 'నివర్' తుపాను పంజా విసిరేందుకు శరవేగంగా దూసుకొస్తోంది. మరో 24 గంటల్లో ఈ తుపాను తీవ్ర తుపానుగా మారనుంది. తమిళనాడులోని మమాళ్లపురం-కరైకల్ మధ్య ఇది తీరాన్ని దాటనుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై తీవ్రంగా ఉండబోతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారు. తుపాను నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవసరమైన అన్నింటినీ సమకూర్చాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని భరోసా ఇచ్చారు. తుపాను సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు.