KTR: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేమే గెలుస్తాం.. మజ్లిస్‌కు రెండో స్థానం: కేటీఆర్
- ఆరేళ్లలో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా?
- లోయర్ సీలేరును ఏపీలో కలిపింది బీజేపీయే
- దేశాన్ని బీజేపీ అమ్మేస్తోంది
- మాపై బీజేపీ చార్జిషీట్లు విడుదల చేస్తోంది
ఆరేళ్లలో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ముస్లింలపై బీజేపీకి ఎంత విద్వేషం ఉందో అందరికీ అర్థమవుతోందని చెప్పారు. లోయర్ సీలేరును ఏపీలో కలిపింది బీజేపీయేనని ఆయన అన్నారు.
దేశాన్ని బీజేపీ అమ్మేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమపై బీజేపీ చార్జిషీట్లు విడుదల చేస్తోందని, పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకు తమపై చార్జిషీట్లు విడుదల చేస్తుందా? అని ఆయన నిలదీశారు. బీజేపీ లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టిందని ఆయన ఆరోపించారు. వారంతా బీజేపీపైనే చార్జిషీట్ వేయాలని అన్నారు.
కరోనా సమయంలో లాక్‌డౌన్ విధించడంతో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు చార్జిషీట్ వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ దేశ భవిష్యత్ కోసమా? గుజరాత్ పెద్దల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. ఆరేళ్లలో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలదా? అని ఆయన నిలదీశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ సారి కూడా తామే గెలుస్తామని, మజ్లిస్ రెండో స్థానంలో నిలుస్తుందని జోస్యం చెప్పారు.