Tarun Gogoi: అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కన్నుమూత
- గువాహటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- గతరాత్రి నుంచి అత్యంత విషమంగా ఆరోగ్యస్థితి
- ఆగస్టులో కరోనా బారినపడిన గొగోయ్
అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. తీవ్ర అస్వస్థతతో ఇటీవలే గువాహటిలోని మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేరిన తరుణ్ గొగోయ్ పరిస్థితి కొన్నిరోజులుగా క్షీణిస్తూ వస్తోంది. గత రాత్రి నుంచి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న గొగోయ్ ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ నిర్ధారించారు.
తరుణ్ గొగోయ్ భౌతికకాయాన్ని రేపు గువాహటిలోని శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. గొగోయ్ అసోం రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆయనకు గత ఆగస్టులో కరోనా సోకింది. ప్లాస్మాథెరపీతో కోలుకున్నారు. కొవిడ్ నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే, కరోనా మహమ్మారి కీలక అవయవాలపై చూపిన ప్రభావం నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు. మరోసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయనను కుటుంబసభ్యులు గువాహటిలోని మెడికల్ కాలేజి ఆసుపత్రికి తీసుకురాగా, అందరినీ విషాదంలో ముంచెత్తుతూ ఈ సాయంత్రం 5.34 గంటలకు తుదిశ్వాస విడిచారు.