: క్షీణిస్తున్న రూపాయి విలువ.. పొంచి ఉన్న కష్టాలు
అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుతుండడంతో మన రూపాయికి కష్టాలొచ్చి పడ్డాయి. రోజురోజుకూ బక్కచిక్కుతోంది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ 56 కు పడిపోయింది. కానీ, ఇలా నే రూపాయి పతనమైతే ఆర్థిక రంగానికి మరిన్ని చిక్కులు రానున్నాయి.
లక్షల కోట్ల రూపాయలతో క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి పతనం అయితే ఒక బ్యారెల్ క్రూడాయిల్ కు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. దీనివల్ల ద్రవ్యలోటు పెరిగిపోతుంది. ఇదొక్కటే కాదు, దిగుమతి ఆధారిత వస్తువులన్నీ భారం అవుతాయి. అదే సమయంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు పతనమవుతుంటే.. మన దగ్గర బంగారం పెద్దగా తగ్గకపోవచ్చు. దీనికి కారణం రూపాయి విలువ పతనమే. రూపాయి విలువ ఒక రూపాయి పడితే బంగారం ధర 500 రూపాయలు(10గ్రాములకు) పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి దేశీయంగా పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలోకి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జీడీపీ 6 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. అయినా రూపాయి పతనం కావడానికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ లో పెట్టుబడులు పెరిగాయి. అమెరికా ఆర్థిక రంగం కోలుకుండడంతో బంగారం నుంచి పెట్టుబడులు డాలర్ లోకి మళ్లుతున్నాయి. దాంతో అది బలపడడం.. ఫలితంగా రూపాయికి కష్టాలు రావడం మొదలైంది. ఈ నేపథ్యంలో ఆర్ బిఐ రూపాయి విలువ కాపాడడానికి చర్యలు ప్రకటించే అవకాశం ఉంది.