Harley Davidson: భారత్ లో మా కార్యకలాపాలు కొనసాగిస్తాం: హార్లే డేవిడ్సన్ స్పష్టీకరణ
- భారత్ నుంచి నిష్క్రమిస్తున్నట్టు రెండు నెలల కిందట ప్రకటన
- ఇటీవల హీరో మోటోకార్ప్ తో ఒప్పందం
- హీరోతో కలిసి పయనం సాగిస్తామని తాజాగా వెల్లడి
రెండు నెలల కిందట తాము భారత్ నుంచి నిష్క్రమిస్తున్నామని ప్రకటించిన వరల్డ్ క్లాస్ క్రూయిజర్ బైక్ తయారీదారు హార్లే డేవిడ్సన్ ఆ ఆలోచనలను విరమించుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దేశీయ ద్విచక్రవాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్న ఈ అమెరికా సంస్థ తాజాగా భారత్ లో కొనసాగుతున్నట్టు ఓ ప్రకటన చేసింది. 2021 జనవరి నుంచి భారత్ లో తమ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది.
దీనిపై హార్లే డేవిడ్సన్ ఎండీ (ఆసియా వర్ధమాన మార్కెట్లు, భారత్) సజీవ్ శేఖరన్ వివరణ ఇచ్చారు. "భారత్ లో మా వ్యాపార ప్రణాళికలో మార్పు చేశాం. భారత్ లో మా వ్యాపార ప్రస్థానాన్ని హీరో మోటోకార్ప్ సంస్థతో కలిసి కొనసాగిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఇకమీదట కూడా భారత్ లోని హార్లే డేవిడ్సన్ వినియోగదారులకు సేవలు అందుతాయి. హార్లే డేవిడ్సన్ నుంచి వచ్చే కొత్త మోడళ్లు, వాటికి సంబంధించిన ఉపకరణాలు, విడిభాగాలు, సాధారణ వస్తు సరంజామా అమ్మకాలు, విక్రయానంతర సేవలు, వారంటీలు, హెచ్ఓజీ (హార్లే ఓనర్స్ గ్రూప్) అప్ డేట్లు అన్నీ 2021 జనవరి నుంచి అందుబాటులోకి వస్తాయి" అని వెల్లడించారు.
భారత్ ఎంతో పెద్ద మార్కెట్ అని, అమ్మకాలు అదిరిపోతాయని భావించిన హార్లే డేవిడ్సన్ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశకు గురైంది. 2009లో భారత మార్కెట్లోకి ఎంటరైన ఈ ప్రపంచ బైకింగ్ దిగ్గజం అమ్మకాల పరంగా ఆకట్టుకోలేకపోయింది. అమెరికా, యూరప్ దేశాల పరిస్థితులకు, భారత్ లోని భిన్నరకాల పరిస్థితులకు ఎంతో తేడా ఉండడంతో ఈ సంస్థ బైకులకు భారత్ లో గడ్డుకాలం ఎదురైంది. పైగా వీటి ధర ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువగా ఉండే భారత్ లో ఆశించిన లాభాలు ఆర్జించలేకపోయింది.