Akshay Kumar: యూ ట్యూబర్ పై రూ. 500 కోట్లకు దావా వేసిన హీరో అక్షయ్ కుమార్!

Akshay Kumar sends 500 Crore Defamation Notice To YouTuber

  • ఎఫ్ఎఫ్ న్యూస్ పేరిట రషీద్ యూట్యూబ్ చానెల్
  • అక్షయ్ పై పలు వీడియోలు పోస్ట్
  • తప్పుడు వీడియోలు పోస్ట్ చేశారని ఆరోపణలు
  • పరువు నష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

ఎఫ్ఎఫ్ న్యూస్ పేరిట యూ ట్యూబ్ చానెల్ ను నడుపుతున్న బీహార్ కు చెందిన రషీద్ సిద్ధిఖ్ఖీ అనే వ్యక్తికి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ. 500 కోట్ల పరువునష్టం దావా నోటీసులు పంపించారు. ఆయన తన చానెల్ ద్వారా తనపై తప్పుడు, నిరాధార ఆరోపణలతో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారని ఆరోపించిన అక్షయ్, తన లీగల్ సంస్థ ఐసీ లీగల్ ద్వారా ఈ నోటీసులు పంపారు. రషీద్ వీడియోలు తనకు పరువు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని, ఎన్నో అభ్యంతరకర వ్యాఖ్యలను ఆయన చేశారని, ఇదే విషయమై ముంబై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి, అభ్యంతరకర వీడియోలను తీసేయించామని ఐసీ లీగల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

'ఈ వీడియోలతో ఎంతో మంచి పేరున్న తన క్లయింట్ మానసికంగా చాలా బాధపడ్డారు. అందుకే రూ. 500 కోట్లు చెల్లించాలంటూ పరువు నష్టం దావా నోటీసులు పంపాము. రియా చక్రవర్తి కెనడాకు పారిపోవడానికి అక్షయ్ సహకరించారని, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరేతో రహస్యంగా సమావేశమయ్యారని తప్పుడు వ్యాఖ్యానాలతో కూడిన వీడియోలను పోస్ట్ చేశారని ఆరోపించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంపై అక్షయ్ తో ముంబై పోలీసు కమిషనర్ చర్చించారని కూడా వీడియోలను పోస్ట్ చేశారని తెలిపారు.

ఈ వీడియోలన్నీ నిరాధారమైనవని, ఎటువంటి ఆధారాలు లేకుండా తయారు చేశారని, కావాలనే తన క్లయింట్ కు నష్టం కలిగేలా వ్యవహరించినందునే పరువునష్టం దావా వేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. రషీద్ వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి, అన్ని వీడియోలనూ స్వయంగా తొలగిస్తే, దావాను ఉపసంహరించుకునే విషయాన్ని తమ క్లయింట్ పరిశీలిస్తారని ఐసీ లీగల్ పేర్కొంది.

  • Loading...

More Telugu News