Jagan: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశం
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ
- ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అంశంపై చర్చ
- తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి అంశంపైనా చర్చ
రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు సీఎం జగన్ క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం వారితో చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారం చర్చకు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల అంశంలో మంత్రుల వ్యాఖ్యలపైనా, ప్రభుత్వంపైనా గవర్నర్ కు ఎస్ఈసీ ఫిర్యాదు చేయడంపైనా సీఎం చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక పైనా సీఎం జగన్ మంత్రుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మరికొన్నిరోజుల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల వ్యవహారం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.