China: దలైలామాను ఎంపిక చేసే హక్కు చైనాకెక్కడిది?: అమెరికా
- 1959 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న 14వ దలైలామా
- వందల ఏళ్లుగా ఉన్న సంప్రదాయమే కొనసాగాలన్న అమెరికా
- టిబెట్‌కు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న అగ్రరాజ్యం
బౌద్ధుల మతగురువు దలైలామా ఎంపిక విషయంలో చైనా కలగజేసుకోవడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు చైనాకు ఆ హక్కు ఎక్కడిదని ప్రశ్నించింది. వందల సంవత్సరాలుగా టిబెట్‌లోని బౌద్ధమతస్థులే తమ తదుపరి దలైలామాను ఎంపిక చేసుకుంటున్నారని, అది తమ హక్కుగా చైనా పేర్కొనడం అర్థరహితమని కొట్టిపారేసింది.
ఈ సందర్భంగా అమెరికాకు చెందిన లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియన్ ఫ్రీడం రాయబారి శామ్యూల్ డీ బ్రౌన్‌బ్యాక్ మాట్లాడుతూ.. తదుపరి దలైలామాను చైనా ఎంపిక చేయడానికి తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. అక్టోబరులో తాను భారత్‌లో పర్యటించినప్పుడు ధర్మశాలలో శరణార్థులుగా ఉన్న టిబెట్ పౌరులతో మాట్లాడానని, అప్పుడు కూడా వారికి ఇదే విషయాన్ని చెప్పానని అన్నారు.
మత గురువుల ఎంపిక విషయంలో వందలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమే కొనసాగాలని తేల్చి చెప్పారు. మత స్వేచ్ఛకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, టిబెట్‌కు అండగా నిలబడేందుకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. కాగా, టిబెట్‌లో చైనా ఆంక్షల కారణంగా ప్రస్తుతం 14వ దలైలామా (85) 1959 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.