Vijayashanti: దుబ్బాకలో ఓడిన తర్వాత కూడా కేసీఆర్ దొరహంకార గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు: విజయశాంతి
- జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- కేసీఆర్ దొరహంకార గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న విజయశాంతి
- వాస్తవదూర ప్రకటనలు చేస్తున్నారని వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దొరహంకార గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవదూరమైన ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అల్లావుద్దీన్ అద్భుతదీపంలా అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏవైనా అద్భుతాలు జరుగుతాయేమోనని ఆశలు పెంచుకున్నారని వ్యాఖ్యానించారు. అనేక సంవత్సరాలుగా గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అందెవేసిన చేయిగా మారిపోయారని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను బుట్టలో వేసి, ఎన్నికల్లో ఓట్లు రాబట్టడం ఎలా అనే అంశంపై కేసీఆర్ ఎంఐఎం అధినేతతో మంతనాలు జరిపినట్టు ప్రచారం జరుగుతోందని విజయశాంతి ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ ఓటర్లు ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఇటీవల కాలంలో ఓటర్ల నాడి చూస్తే అర్థమవుతోందని వెల్లడించారు. ఏదేమైనా జీహెచ్ఎంసీ మేయరు పదవి ఈ పర్యాయం 'మేసేవారికి' కాక 'మేయరు' అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం అని విజయశాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.