Bihar: సుశీల్ మోదీకి ఏ మాత్రం అన్యాయం జరుగబోదు... పెద్ద బాధ్యతలే రాబోతున్నాయి: దేవేంద్ర ఫడ్నవీస్

Sushil Modi Gets Bigger Position says Devendra Fadnavis

  • బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణం
  • గత అసెంబ్లీలో డిప్యూటీగా సుశీల్
  • సుశీల్ బీజేపీకి పెద్ద ఆస్తన్న దేవేంద్ర ఫడ్నవీస్
  • సుశీల్ గొప్ప నేతన్న గిరిరాజ్ సింగ్

బీహార్ కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా, మొత్తం మీద ఏడోసారి సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ, ఆయనకు డిప్యూటీగా ఉన్న బీజేపీ నేత సుశీల్ మోదీకి మాత్రం మరోసారి ఆ స్థానం దక్కలేదన్న సంగతి తెలిసిందే.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన పార్టీ సమావేశంలో సుశీల్ ను ఉప ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించాలని, ఆయన స్థానంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"సుశీల్ మోదీ ఎన్నటికీ అసంతృప్తితో ఉండరు. మాకు ఆయన ఓ పెద్ద ఆస్తి. పార్టీ ఆయన గురించి ఆలోచిస్తుంది. కొత్త బాధ్యతలను సుశీల్ కు అప్పగించనున్నాం" అని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. కాగా, సుశీల్ మోదీని కేంద్ర మంత్రివర్గంలోకి మోదీ ఆహ్వానించనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే, తనను ఉప ముఖ్యమంత్రిగా తొలగించారని తెలుసుకున్న తరువాత సుశీల్ మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. "గడచిన 40 సంవత్సరాలుగా బీజేపీ, సంఘ్ పరివార్ నా రాజకీయ జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఎవరికీ ఇవ్వలేనంత ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. ఇప్పుడు నాకు ఇచ్చిన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఓ కార్యకర్తగా నాకున్న బాధ్యతలను మాత్రం ఎవరూ దూరం చేయలేరు" అన్నారు. 

సుశీల్ ఈ వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయన సుదీర్ఘ సన్నిహితుడు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, "గౌరవనీయ సుశీల్ జీ... మీరు మాకు నేత. మీరు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మీరు ఎప్పటికీ బీజేపీ నేతగానే ఉంటారు. ఆ హోదాను మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు" అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News