Telangana: వెంటనే టపాసుల దుకాణాలు మూసేయాలి: తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- నిన్న నిషేధం విధించిన హైకోర్టు
- నిబంధనలు ఉల్లంఘించకుండా సర్కారు చర్యలు
- డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లు, సీపీలకు ఆదేశాలు
- సుప్రీంకోర్టుకు వెళ్లిన క్రాకర్స్ అసోసియేషన్
తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కొనుగోళ్లపై నిన్న హైకోర్టు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. వాటి విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలకు తెలంగాణ రాష్ట్ర సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు, వెంటనే బాణసంచా దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాణసంచా దుకాణాల మూసివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా తెలంగాణలో బాణసంచా నిషేధానికి తీసుకున్న చర్యలను తెలంగాణ సర్కారు కోర్టుకు ఈ నెల 19న వివరాలు తెలపాల్సి ఉంటుంది.
కాగా, పండుగకు ఒక్కరోజు ముందు ఇటువంటి ఆదేశాలు రావడంతో బాణసంచా దుకాణాల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టులో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. బాణసంచా నిషేధంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.