Jeedigunta Ramachandra Murthy: హీరో వరుణ్ సందేశ్ తాత, ప్రముఖ రచయిత జీడిగుంట మృతి
- ఆకాశవాణి ద్వారా శ్రోతలకు సుపరిచితులు
- కొన్ని సినిమాలకు రచన చేసిన జీడిగుంట
- ఇటీవల కరోనా బారిన పడిన జీడిగుంట
- చికిత్స పొందుతూ మృత్యువాత
టాలీవుడ్ యువ హీరో వరుణ్ సందేశ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వరుణ్ సందేశ్ తాత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జీడిగుంట రామచంద్రమూర్తి మృతి పట్ల ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
జీడిగుంట రామచంద్రమూర్తి ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు. పలు సినిమాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. టీవీ సీరియళ్లకు స్క్రిప్టు రాశారు. 'అమెరికా అబ్బాయి' చిత్రానికి కథ అందించిన జీడిగుంట, 'ఈ ప్రశ్నకు బదులేది', 'పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు' అనే చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు. 'అమృత కలశం', 'మరో మాయాబజార్' చిత్రాలకు రచనా విభాగంలో పాలుపంచుకున్నారు.
జీడిగుంట రామచంద్రమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. రేడియో నాటకాలు రాయడమే కాక వాటిలో నటించడం, కథలు, నాటికలు, నవలలు, సినిమా రచన ఇలా అనేక విధాలుగా తన సాహితీ ప్రజ్ఞను చాటుకున్నారు. జీడిగుంట అప్పట్లో సారా ఉద్యమ నిషేధంపై రాసిన పరివర్తన అనే నాటకానికి గాను ఉత్తమ రచయితగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు, పలు టెలివిజన్ కార్యక్రమాలకు కూడా ఆయన నంది పురస్కారాలు పొందారు.
ఆయన రచన వ్యాసంగంపై మక్కువతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఆకాశవాణి రేడియోలో చేరారు. హైదరాబాద్ రేడియో కేంద్రంలో 28 ఏళ్ల పాటు పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాదు, ఆకాశవాణిలో ప్రసారమైన 'కార్మికుల కార్యక్రమం'లో ఆయన బాలయ్యగా నటించేవారు. అందులోని చిన్నక్క, ఏకాంబరం, బాలయ్య పాత్రలు అప్పట్లో ఎంతో పాప్యులర్ అయ్యాయి. సుమారు నాలుగేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని ఆయన నిర్విరామంగా నిర్వహించారు.
జీడిగుంట రామచంద్రమూర్తికి ముగ్గురు కుమారులు కాగా, పెద్దకుమారుడు విజయసారథి తనయుడే వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్ సోదరి వీణా సాహితి 'అలా మొదలైంది' చిత్రానికి పాటలు రాశారు. ఇక జీడిగుంట రెండో తనయుడు శ్రీధర్ టెలివిజన్ సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.