Donald Trump: రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ను తొలగించిన ట్రంప్!

Trump Fired Defence Secretary Mark Esper

  • ఎన్నికల్లో ఓడిపోయినా అంగీకరించని ట్రంప్
  • కొత్త రక్షణ మంత్రిగా క్రిస్టొఫర్ మిల్లర్ నియామకం
  • నాలుగేళ్లలో నలుగురిని మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనా, ఇంకా అంగీకరించని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ను పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో స్వయంగా వెల్లడించిన ఆయన, "మార్క్ ఎస్పర్ ను తొలగించాం. ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు. ఇకపై రక్షణ మంత్రిగా క్రిస్టొఫర్ మిల్లర్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం మిల్లర్ జాతీయ కౌంటర్ టెర్రరిజం సెంటర్ హెడ్ గా పనిచేస్తున్నారు. గతంలో ప్రత్యేక సైనిక దళాల అధినేతగానూ సేవలందించారు.

గడచిన నాలుగేళ్లలో పెంటగాన్ చీఫ్ ను ట్రంప్ మార్చడం ఇది నాలుగోసారి. తాజాగా రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించబడిన ఎస్పర్ 16 నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా తనకు రాజకీయ నష్టం సంభవించిందని ట్రంప్ భావించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశంలో పౌర సమాజం నిరసనలకు దిగుతున్న వేళ, ఫెడరల్ సైనిక దళాలను రంగంలోకి దించాలని ట్రంప్ ఒత్తిడి పెట్టినా, ఎస్పర్ వినలేదు. ఇప్పుడు ఆయన తొలగింపునకు అదే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఆఫ్ఘనిస్థాన్ నుంచి యూఎస్ సైన్యాన్ని వెనక్కు పిలిపించడం, ఆపై అక్కడ హింసాత్మక ఘటనలు పెరగడం కూడా ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఎస్పర్ తొలగింపు తప్పదని గత కొంతకాలంగా వైట్ హౌస్ అంతర్గత బృందం అంచనా వేస్తూనే ఉంది. అయితే, ఎన్నికల తరువాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News