Varla Ramaiah: ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల సాయం అందుకోవడానికి అబ్దుల్ కుటుంబంలో ఎవరూ లేరు: వర్ల రామయ్య
- నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య
- రూ.25 లక్షల సాయం ప్రకటించిన ప్రభుత్వం
- హోంమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న వర్ల రామయ్య
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం అనే ఆటోడ్రైవర్ తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోగా, అతడి కుటుంబంపై ఆధారపడిన ఓ వృద్ధురాలు మిగిలి ఉందంటూ ఏపీ సర్కారు రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు.
అయితే హోంమంత్రి వ్యాఖ్యల పట్ల టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య స్పందించారు. నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై హోంమంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. రూ.25 లక్షల సాయం ప్రకటించామని చెబుతున్నారని, ఆ సాయం అందుకోవడానికి అబ్దుల్ కుటుంబంలో ఎవరూ లేరని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా, సీఎం జగన్ భజన చేస్తున్నారంటూ హోంమంత్రిపై విమర్శలు చేశారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులపైనా, బలహీన వర్గాలపైనా దాడులు పెరిగాయని ఆరోపించారు. ఇప్పుడు నంద్యాల ఆత్మహత్యల కేసును కూడా ప్రభుత్వమే నీరుగార్చేందుకు ప్రయత్నించడం విచారకరమని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు.