KTR: చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
- కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు
- అయినప్పటికీ వరద బాధితులకు సాయం చేశాం
- ప్రజల కష్టాలను పరిష్కరిస్తున్నాం
- మోదీకి కేసీఆర్ లేఖ రాశారు
- ఇప్పటి వరకు మోదీ స్పందించలేదు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటీవల భారీ వర్షాలు పడితే ప్రజలకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు సహకరించాల్సింది పోయి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేశారని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు.
ఇటువంటి రాజకీయాలు చేసి విపక్షాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారం కావద్దని కేటీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోయినప్పటికీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తామంతా ప్రజల కష్టాలను పరిష్కరిస్తుంటే, వారు మాత్రం దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. సైదాబాద్‌లో బీజేపీ కార్యకర్త ఇంటికెళ్లి అధికారులు సాయం అందించారని, సాయం అందుకున్న బీజేపీ కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన వివరించారు.
కర్ణాటక విషయంలో మాత్రం ప్రధాని మోదీ తక్షణమే స్పందించారని, ఆ రాష్ట్ర సీఎం లేఖ రాసిన వెంటనే ఆ రాష్ట్రానికి నిధులు విడుదల చేశారని కేటీఆర్ చెప్పారు. తాము ఇప్పటి వరకు 4.30 లక్షల కుటుంబాలకు సాయం అందించామని, వారి వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ అన్నారు.
తమ ప్రభుత్వం ప్రజలదని, వరద బాధితులందరినీ ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు. అవసరమైతే మరో రూ.100కోట్లు కేటాయిస్తామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలకు సాయం అందించామని కేటీఆర్ తెలిపారు.