New Delhi: ఢిల్లీలో నకిలీ కాల్‌సెంటర్.. యూఎస్, కెనడా ప్రజలే లక్ష్యం!
- 17 మంది అరెస్ట్.. 20 కంప్యూటర్లు సీజ్
- పాపప్ మెసేజ్‌లు పంపి వ్యక్తిగత సమాచారం హ్యాక్
- మైక్రోసాప్ట్ టెక్నికల్ సాయం పేరుతో కోట్లు దండుకున్న ముఠా
అమెరికా, కెనడా ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీలో నకిలీ కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న 17 మందికి సైబర్ క్రైమ్ పోలీసులు అరదండాలు వేశారు. రాజధానిలోని రాజౌరీ గార్డెన్లో ఉన్న దీనికి సహిల్ దిల్వారీ అనే వ్యక్తి గత మూడేళ్లుగా యజమానిగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కాల్‌సెంటర్ నుంచి పై రెండు దేశాల్లోని ప్రజలకు పాపప్ మెసేజ్‌లు పంపి వారి వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేస్తారు. అలాగే, వారి ఎలక్ట్రానిక్ పరికరాలు వైరస్ బారినపడేలా చేస్తారు.
అనంతరం మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సాయం పేరుతో వాళ్ల నుంచి ఈ ముఠా డబ్బులు దోచుకుంటోందని పోలీసులు తెలిపారు. నిన్న ఈ సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు 17 మందిని అరెస్ట్ చేయడంతోపాటు 20 కంప్యూటర్లను సీజ్ చేశారు. అందులోని సమాచారం ఆధారంగా గత ఏడాది కాలంగా అమెరికా, కెనడాల్లోని 2268 మందిని మోసం చేసి దాదాపు 8 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.