IPL 2020: బుమ్రా దెబ్బకు చిగురుటాకులా వణికిన ఢిల్లీ.. ఫైనల్‌లో అడుగుపెట్టిన ముంబై
- 57 పరుగుల తేడాతో ముంబై విజయం
- చెత్తగా, చిత్తుగా ఓడిన ఢిల్లీ
- శ్రేయాస్ సేనకు మరో అవకాశం
ఊహించినదే అయింది. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి దర్జాగా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఓడిన ఢిల్లీకి మాత్రం మరో అవకాశం ఉంది. నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలుపొందిన వారితో ఢిల్లీ తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై తొలి బంతి నుంచే వీరబాదుడు బాదింది. డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాల వీర విహారంతో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 201 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ 143 పరుగులు మాత్రమే చేసి 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో బంతికి పృథ్వీషా, ఐదో బంతికి అజింక్య రహానేలు డకౌట్ అయ్యారు. ఆ తర్వాతి ఓవర్ రెండో బంతికి శిఖర్ ధవన్ కూడా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ఇలా ఖాతా తెరవకుండానే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ ఓటమి అప్పుడే ఖాయమైంది. దీనికితోడు ముంబై బౌలర్లు మరింతగా పట్టు బిగించడంతో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వణికిపోయారు. పరుగులు తీయడానికి నానా తంటాలు పడ్డారు.
స్టోయినిస్, అక్సర్ పటేల్ మాత్రం బౌలర్లను కాసేపు ఎదురొడ్డినా అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే పరిమితమైంది. 46 బంతులు ఎదుర్కొన్న స్టోయినిస్ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేయగా, అక్సర్ పటేల్ 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు.
కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 12, రబడ 15 పరుగులు చేశారు. డేనియల్ శామ్స్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ జట్టులో మొత్తం నలుగురు ఆటగాళ్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరడం గమనార్హం. చివరికి 20 ఓవర్లలో 143/8 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. ముంబై బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ 2, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్‌లు డకౌట్ అయినా, మిగతా బ్యాట్స్‌మెన్ మాత్రం చెలరేగిపోయారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా చివర్లో బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. 14 బంతుల్లో 5 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.
ఇక డికాక్ 40 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ (51), ఇషాన్ కిషన్ (55, నాటౌట్)లు అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. కృనాల్ పాండ్యా 13 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా, నార్జ్, స్టోయినిస్ చెరో వికెట్ తీసుకున్నారు. నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన జస్ప్రిత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.