The Guardian: అత్యంత ప్రమాదకరంగా విడిపోయిన అమెరికా ప్రజలు... 'ది గార్డియన్' సంపాదకీయం!
- ఎవరు గెలిచినా ప్రపంచానికి వెళ్లిన సంకేతం ఒకటే
- ట్రంప్ ను తీవ్రంగా తిరస్కరించిన ఓటర్లు
- పరిస్థితులన్నీ ఆయనకు వ్యతిరేకమే
ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో చివరకు ఎవరు గెలిచినా, అమెరికా ప్రజలు అత్యంత ప్రమాదకరంగా విడిపోయిన సంకేతాలు మాత్రం ప్రపంచానికి వెళ్లినట్టేనని 'ది గార్డియన్' నేటి తన సంపాదకీయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. దేశం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సమానంగా విడిపోయిందని అంచనా వేసింది.
మూడు దశాబ్దాల తరువాత తొలిసారిగా ప్రస్తుత అధ్యక్షుడు ఓటర్ల తీవ్ర తిరస్కరణకు గురవుతున్నారని ముందస్తు పోల్స్ సూచించినప్పటికీ, ఆయన అంగీకరించలేదని, ప్రస్తుతం పరిస్థితి ఆయనకు వ్యతిరేకమైపోయిందని తెలిపింది. జనాదరణ పొందిన ఓటులో అతితక్కువ భాగం జో బైడెన్, ట్రంప్ లను వేరు చేసిందని అభిప్రాయపడింది.
"మిస్టర్ ట్రంప్ భారీ తేడాతో ఓడిపోవడానికి అర్హుడు. అందుకు ప్రధాన కారణం కరోనా వైరస్. ఈ మహమ్మారి సంక్షోభాన్ని ఆయన సరిగ్గా నియంత్రించలేదు. దీని కారణంగానే లక్షలాది మంది అమెరికన్ల ప్రాణాలు పోయాయి. నవీన యుఎస్ చరిత్రలో అత్యంత చెత్త పరిపాలనను నడిపిన వ్యక్తిగానూ ట్రంప్ చరిత్రలో నిలిచిపోనున్నారు" అని పత్రిక వ్యాఖ్యానించింది. ఇక ఆయన పార్టీలోనే వ్యతిరేక వర్గం పెరిగిపోయిందని, వచ్చే నాలుగేళ్లూ ఆయనకే అవకాశం ఇస్తే, తమకు ముప్పు తప్పదని అమెరికన్లు భావించడంతోనే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొంది.