Rahul Gandhi: మోదీతో సిద్ధాంతపరమైన యుద్ధం చేస్తున్నా: రాహుల్ గాంధీ
- మోదీ ఓటింగ్ మెషీన్లకు భయపడం
- నా గురించి మోదీ ఎప్పుడూ దారుణంగానే మాట్లాడతారు
- నేను ప్రేమను మాత్రమే పంచుతాను
ఈవీఎంలు, మీడియాను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోదీ ఓటింగ్ మెషీన్ కు కానీ, మోదీకి అనుకూలంగా ఉండే మీడియాకు కానీ తాము భయపడే ప్రసక్తి లేదని అన్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని చెప్పారు.
మోదీతో తాను సిద్ధాంతపరమైన యుద్ధం చేస్తున్నానని తెలిపారు. వారి ఆలోచనలను తాము ఓడిస్తామని అన్నారు. బీహార్ లోని అరారియాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో ప్రసంగిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఎన్నికల సందర్భంగా ఈవీఎంల గురించి రాహుల్ మాట్లాడుతూ... మోదీ, ఆయన గ్యాంగ్ ముందు ఈసీ మోకరిల్లిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు రాహుల్ మాట్లాడుతూ, తన గురించి మోదీ ఎప్పుడూ దారుణంగానే మాట్లాడుతుంటారని విమర్శించారు. వారు ఎంత విద్వేషాన్ని ప్రచారం చేసినా... తాను మాత్రం ప్రేమను పంచుతానని చెప్పారు. ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేమని... కేవలం ప్రేమ ద్వారానే ద్వేషాన్ని గెలవగలమని తెలిపారు. మోదీని ఓడించేంత వరకు తాను ఒక ఇంచు కూడా కదలబోనని అన్నారు.
ఉద్యోగాలను కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నితీశ్ కుమార్ నిలబెట్టుకోలేదని... అందుకే యువత ఆయనను నిలదీస్తున్నారని రాహుల్ చెప్పారు. ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.