Walden: హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మక వాల్డెన్ బుక్ స్టోర్ శాశ్వతంగా మూసివేత!
- 1990లో తొలి స్టోర్ ఏర్పాటు
- ఓ తరం పుస్తక ప్రియులకు సుపరిచితం
- అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పలువురు
ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రచురణ సంస్థ విడుదల చేసే ఏ పుస్తకమైనా లభిస్తుందన్న పేరున్న వాల్డెన్ బుక్ స్టోర్, హైదరాబాద్ లో ఇప్పుడు శాశ్వతంగా మూడపడింది. 1990లో హైదరాబాద్ లో తొలి స్టోర్ ను ప్రారంభించిన వాల్డెన్, ఆపై మరో రెండు స్టోర్లను ప్రారంభించింది. 2000 దశకం ముగిసేవరకూ నిత్యమూ కళకళలాడిన బుక్ స్టోర్, ఆన్ లైన్ మాధ్యమాల విస్తరణతో ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది.
గత సంవత్సరంలో తన ప్రధాన స్టోర్ ను మూసివేసిన వాల్డెన్, రెండు శాఖలను నడుపుతూ వచ్చింది. తాజాగా, వాటిని కూడా మూసివేసింది. ఇక ఈ స్టోర్లు మూతపడ్డాయని తెలుసుకున్న పలువురు, స్టోర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆరు నెలల పాటు ఎటువంటి వ్యాపారమూ సాగకపోవడం, ప్రజల్లో పుస్తకాలు కొని చదవాలన్న ఆసక్తి లేకపోవడంతో, వ్యాపారం కుదేలైంది. ఈ కారణంతోనే స్టోర్ ను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక స్టోర్ ను మూసివేసిన విషయాన్ని స్వయంగా వెల్లడించిన యజమాని రామ్ ప్రసాద్ (సినీనటుడు జగపతిబాబు సోదరుడు), భారమైన హృదయాలతో తమ చివరి వాల్డెన్ స్టోర్ ను మూసివేస్తున్నట్టు ట్విట్టర్ లో తెలిపారు. తమను ఆదరించిన పుస్తక ప్రియులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్టోర్ ను గతంలో ఎన్నోమార్లు సందర్శించిన నటి సుస్మితా సేన్ సైతం ట్విట్టర్ లో స్పందించారు. ఎన్నో మంచి పుస్తకాలను తన జీవితంలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, రేపన్నది ఒకటి ఉంటుందని వ్యాఖ్యానించారు.