KBC: కేబీసీలో హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రశ్న... అమితాబ్ బచ్చన్ పై ఫిర్యాదు!
- అంబేద్కర్ తగుల బెట్టిన గ్రంథంపై ప్రశ్న
- కేబీసీని కమ్యూనిస్టులు హైజాక్ చేశారన్న వివేక్ అగ్నిహోత్రి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన లక్నో వ్యక్తి
కౌన్ బనేగా కరోడ్ పతి మరో వివాదంలో చిక్కుకుంది. బిగ్ బీ వ్యాఖ్యాతగా జరిగే ఈ కార్యక్రమం అమిత ప్రేక్షకాదరణను పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారంటూ, లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. గత శుక్రవారం ప్రసారమైన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్ లో రూ.6.40 లక్షల ప్రైజ్ మనీ కోసం అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా ఉండటమే ఇందుకు కారణం.
ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే, 1927 డిసెంబర్ 25న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఆయన అనుచరులు కలిసి ఏ గ్రంథ ప్రతులను దహనం చేశారు?... దీనికి ఆప్షన్స్ గా ఏ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి అని ఇచ్చారు. దీనికి కంటెస్టెంట్లు ఆన్సర్ ఇచ్చిన తరువాత, అమితాబ్ మరింత వివరణ ఇస్తూ, దేశంలో కుల వివక్షను, అస్పృశ్యతను పెంచేలా ఉందన్న కారణంతోనే మనుస్మృతి గ్రంథాన్ని అంబేద్కర్ తగులబెట్టారని అన్నారు.
ఇక, ఆ వెంటనే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. అమితాబ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారంటూ వందలాది కామెంట్లు వచ్చాయి. కేబీసీని కమ్యూనిస్టులు హైజాక్ చేస్తున్నారంటూ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా మండిపడ్డారు. అమితాబ్ అడిగిన ప్రశ్నను మీరూ చూడవచ్చు.