BJP: 'హస్తం గుర్తుకే మన ఓటు' అని నాలుక్కరుచుకున్న జ్యోతిరాదిత్య సింధియా... వీడియో ఇదిగో!
- ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న జ్యోతిరాదిత్య
- ఇమర్తీ దేవికి మద్దతుగా ప్రచారం
- సభలో పొరపాటున నోరు జారగా వీడియో వైరల్
పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్లేమో, ఆ పేరు మనసులో పాతుకుపోయింది. ఇక, ఇప్పుడు బీజేపీలో ఉన్నా, జ్యోతిరాదిత్య సింధియా మది పొరల్లోని కాంగ్రెస్ నామం అప్పుడప్పుడూ అనుకోకుండా బయటకు వస్తోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలో అదే జరిగింది. ఆయన్ను కాస్త ఇబ్బందికి గురి చేసింది. బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి పోటీ చేస్తున్న దబ్రా నియోజకవర్గంలో పర్యటించిన ఆయన, 'హస్తం గుర్తుకే మన ఓటు' అని నినదించి, అందరినీ ఆశ్చర్యపరచడంతో పాటు, తాను నాలుక్కరుచుకున్నారు.
ఇటీవల కమల్ నాథ్ ఓ సభలో మాట్లాడుతూ, ఇమర్తీ దేవిని 'ఐటమ్'గా అభివర్ణించి, విమర్శలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన సింధియా, "మీ చేతులు కలపండి. నన్ను, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చెప్పండి. దాబ్రా ప్రజలారా, నా ప్రియమైన ప్రజలారా... 3వ తేదీన మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. ఆ వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, దాన్ని సరిదిద్దుకున్నారు.
అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సింధియా వీడియోలు వైరల్ కాగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్, తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. "సింధియా గారూ... మధ్యప్రదేశ్ ప్రజలు నవంబర్ 3న హస్తం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు" అని క్యాప్షన్ పెట్టింది. కాగా, ఇమర్తీ దేవితో పాటు మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు గత మార్చిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో, ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.