KTR: తెలంగాణ ప్రజలకు ఈ విషయం తెలియాలి: మంత్రి కేటీఆర్
- కేంద్రం నుంచి అందుతున్న సాయంపై ట్వీట్
- 2014 నుంచి పన్నుల రూపంలో 2,72,926 కోట్లు ఇచ్చాం
- తెలంగాణకు 1,40,329 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చాయి
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఎల్లుండి జరగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న వీటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం చివరిరోజున టీఆర్ఎస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దుబ్బాకలో ఈసారి బీజేపీ జోరుగా ప్రచారం చేస్తుండడంతో ఆ పార్టీపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు అందుతున్న సాయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 2014 నుంచి పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి 2,72,926 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించామని కేటీఆర్ అన్నారు. అయితే, కేంద్ర సర్కారు నుంచి తెలంగాణకు 1,40,329 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని తెలిపారు. భారత ఆర్థిక రంగాభివృద్ధికి తెలంగాణ గొప్ప పాత్రపోషిస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన పోస్ట్ చేశారు.