Harish Rao: శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పులను లెక్కించినట్టు బీజేపీ అబద్ధాలను లెక్కిస్తున్నా... వాటిలో కొన్ని ఇవిగో: హరీశ్ రావు

Harish Rao describes BJP as Bharathiya Jhuta Party

  • దుబ్బాకలో తీవ్రస్థాయిలో ప్రచార హోరు
  • బీజేపీపై దూకుడు పెంచిన హరీశ్ రావు  
  • బీజేపీని నమ్మవద్దంటూ దుబ్బాక ప్రజలకు సూచన

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి హరీశ్ రావు తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ముఖ్యంగా బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిశుపాలుడి వంద తప్పులను శ్రీకృష్ణుడు లెక్కించినట్టు తాను బీజేపీ అబద్ధాలను లెక్కపెడుతున్నానని అన్నారు. 'బీజేపీ ఆడుతున్న అబద్ధాల్లో కొన్ని మీ ముందు ఉంచుతున్నా' అంటూ అనేక అంశాలను ఏకరవు పెట్టారు.

వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక ఎన్నిక గెలవాలన్నది బీజేపీ ఆలోచన అని ఆరోపించారు. బీజేపీ అంటూ భారతీయ ఝూటా పార్టీ (అబద్ధాల పార్టీ) అని వ్యంగ్యం ప్రదర్శించారు. బీజేపీ రాష్ట్ర నేతలు మొదలుకుని ఆ పార్టీ కార్యకర్తల వరకు ఒక్కరైనా నిజాలు మాట్లాడడంలేదని విమర్శించారు. సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారని, అసత్యమేవ జయతే అనే సూక్తిని నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అంశాలను ఉదాహరించారు.

  • దుబ్బాకలో పాలిటెక్నిక్ కాలేజి మంజూరైతే నేను దాన్ని సిద్ధిపేటకు తీసుకెళ్లానట. వాస్తవం ఏంటంటే అసలు పాలిటెక్నిక్ కాలేజియే మంజూరు కాలేదు, ఇక శంకుస్థాపన ఎక్కడ జరిగినట్టు!

  • చేగుంటకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరైందట... దాన్ని మావాళ్లు గజ్వేల్ తరలించుకుపోయారట! ఇది ఓ బీజేపీ ఎంపీ ఆరోపణ. ఆ ఆసుపత్రి రూ.25 కోట్లతో మంజూరైందని అంటున్నారు. కనీసం ఆ ఆసుపత్రి ఎక్కడో చూపిస్తే సంతోషిస్తాం. కనీసం ఉత్తర్వుల కాగితం అయినా చూపిస్తారా?

  • మోటార్లకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారట. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది పరాకాష్ఠ. అసలు విద్యుత్ నూతన ముసాయిదా చట్టం తెచ్చిందే కేంద్రం. ఈ చట్టాన్ని మేం ఒప్పుకోవడంలేదని ప్రధానమంత్రికి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే మా విధానం.

  • సిద్ధిపేట సోదాల్లో డబ్బులు దొరికితే... పోలీసులే ఆ డబ్బును పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతకంటే అబద్ధం ఏముంటుంది? అత్తామామలే నిజం చెప్పారు కదా! పైగా ఈ డబ్బుకు సంబంధించిన వీడియోలు కూడా రిలీజయ్యాయి. ఇప్పుడు ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో బీజేపీ నేతలకు తెలియడంలేదు.

  • సిద్ధిపేటలో సోదాలు జరిగింది ఇద్దరు టీఆర్ఎస్ నేతలు ఇళ్లు, ఇద్దరు బీజేపీ నేతల ఇళ్లలో. కానీ 8 నివాసాల్లో దాడులు జరిగాయని బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారం చేశారు. బీజేపీ వాళ్లకు చెందిన ఎనిమిది ఇళ్లపై దాడులు చేసి వేధిస్తున్నారంటూ దుష్ప్రచారం చేశారు. అసలు, పోలీసులు సోదాలు చేస్తుంటే ఎన్నికల ప్రచారం మానేసి బీజేపీ వాళ్లు ఎందుకు ధర్నా చేసినట్టు?

  • టీఆర్ఎస్ సర్కారు మరే రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు రూ.2,016 ఇస్తోంది. అయితే, అందులో రూ.1,600 కేంద్రం ఇస్తోందని, మోదీ పైనుంచి పంపుతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో నేను విసిరిన సవాల్ కు ఇప్పటివరకు ఒక్కరు స్పందించలేదు. బీజేపీ నేతలు తోక ముడిచారు.

  • రేషన్ బియ్యం వ్యవహారంలోనూ ఇవే ఆరోపణలు. రేషన్ బియ్యం సబ్సిడీలో కేంద్రం రూ.29 ఇస్తే, రాష్ట్రం రూ.1 మాత్రమే ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే.... రేషన్ బియ్యం అంశంలో సగం మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది. మిగతా సగం రాష్ట్ర సర్కారు భరిస్తుంది.

  • తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం అంతా కేంద్రమే కొంటుందట. అందుకోసం రూ.5,500 కోట్లు విడుదల చేశారట. ఇదొక పచ్చి అబద్ధం. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్రమే వడ్లు కొని రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తోంది.
ఇవేకాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ అబద్ధాల నేతల మాటలు వింటే మోసపోవడం ఖాయం. దుబ్బాక ప్రజలు ఈ భారతీయ ఝూటా పార్టీ నుంచి జాగ్రత్తగా ఉండాలి అంటూ హరీశ్ రావు తన ప్రసంగంలో సూచించారు.

  • Loading...

More Telugu News