Nara Lokesh: చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారు: నారా లోకేశ్
- కేసుల కోసం బీజేపీకి జగన్ లొంగిపోయారు
- పోలవరంకు రూ. 30 వేల కోట్ల నష్టం కలిగింది
- వ్యవసాయ బోర్లకు మోటార్లు బిగిస్తే ఊరుకోం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, తాడేపల్లిలో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ ఇప్పుడు చెన్నైలో కూడా మరో ప్యాలెస్ కట్టుకుంటున్నారని ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకే బీజేపీ హైకమాండ్ కు జగన్ లొంగిపోయారని, పోలవరం అంచనాలను కుదించారని విమర్శించారు. వైసీపీకి చేతకాని 22 మంది ఎంపీలు ఉన్నారని... వారి వల్ల పోలవరంకు రూ. 30 వేల కోట్లు నష్టపోయామని అన్నారు.
రూ. 4 వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపుకు జగన్ ప్రభుత్వం సిద్ధపడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం మీటర్లను బిగిస్తే... తాము వాటిని పీకేస్తామని చెప్పారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే జగన్ ప్యాలెస్ లను తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని... రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలని... వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రూ. 5 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.