passes away: అనారోగ్యంతో గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కన్నుమూత
- గత నెల కరోనాను జయించిన కేశుభాయ్
- అనారోగ్యంతో మళ్లీ అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స
- సంతాపం వ్యక్తం చేసిన మోదీ
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ (92) ఈ రోజు కన్నుమూశారు. గత నెల ఆయనకు కరోనా సోకడంతో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయనను కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆయనను అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చించారు. ఈ రోజు పరిస్థితి విషమించి కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి పని చేసిన రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు.
కాగా, గత కొన్నేళ్ల నుంచి కేశుభాయ్ పటేల్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన 1928, జులై 24 న జునాగద్ జిల్లాలోని విశవదార్ పట్టణంలో జన్మించారు. యువకుడిగా ఉన్న సమయం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారకునిగా పని చేశారు. దేశంలో అత్యయిక పరిస్థితి సమయంలో జైలుకు వెళ్లారు.
1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా చేరి, 1977లో రాజ్‌కోట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కొన్నాళ్లుకు తన పదవికి రాజీనామా చేసి ‘జనతా మోర్చ్’ ప్రభుత్వంలో చేరారు. 1978నుంచి 1980వరకు వ్యవసాయ మంత్రిగా, 1995లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998 మార్చి నెలలో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనారోగ్య కారణాల వల్ల 2001లో పదవికి రాజీనామా చేశారు.