Britian: వచ్చే నెల 2 నుంచే ఆస్ట్రాజెనెకా కరోనా టీకా పంపిణీ మొదలు.. లండన్ ఆసుపత్రికి ఆదేశాలు!
- ‘ది సన్’ పత్రిక సంచలన కథనం
- తొలుత వైద్యులు, నర్సులు, కొవిడ్ వారియర్లకు వ్యాక్సిన్
- ధ్రువీకరించని ఎన్‌హెచ్ఎస్
కరోనా వైరస్‌కు కళ్లెం వేసేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా వచ్చే వారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది సన్’ పేర్కొంది. టీకాను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలని లండన్‌లోని ఓ ఆసుపత్రికి ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలిపింది. అంతేకాదు, నవంబరు 2 నుంచి టీకా పంపిణీని ప్రారంభించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) రెడీ అవుతున్నట్టు వివరించింది.
ఆదేశాల నేపథ్యంలో ఆసుపత్రిలో అన్ని వైద్య సేవలను నిలిపివేశారని, తొలుత ఈ టీకాను వైద్యులు, నర్సులు, కొవిడ్ మహమ్మారిపై పోరాడుతున్న ఇతరులకు ఇవ్వనున్నట్టు పత్రిక తన కథనంలో పేర్కొంది. అయితే, ఈ వార్తలను ఎన్‌హెచ్ఎస్ ఇప్పటి వరకు ధ్రువీకరించలేదు. అలాగని ఖండించకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఉందని అంటున్నారు.