Corona Virus: తుది అంకం మొదలు... 'కోవాక్సిన్' మూడో దశ ట్రయల్స్ కు అనుమతులు!
- 28,500 మందిపై ట్రయల్స్
- 19 చోట్ల ప్రయోగించనున్న భారత్ బయోటెక్
- విజయవంతమైతే వ్యాక్సిన్ విడుదల
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాక్సిన్' ట్రయల్స్ తుది అంకానికి చేరుకున్నాయి. అత్యంత కీలకమైన మూడవ దశ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతులు లభించాయి. తొలి రెండు దశల ట్రయల్స్ పూర్తయ్యాయని చెబుతూ, అందుకు సంబంధించిన నివేదికను డీజీసీఐకి ఇటీవల భారత్ బయోటెక్ పంపింది.
ఇక మూడవ దశ ట్రయల్స్ మొత్తం 28,500 మందిపై జరుగుతుందని, 18 ఏళ్లు దాటిన వారిని ఎంచుకుని, దేశవ్యాప్తంగా 19 పట్టణాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని సంస్థ పేర్కొంది. ఢిల్లీ, ముంబై, పట్నా, లక్నో తదితర నగరాల్లో ఇవి జరుగుతాయని పేర్కొంది. ఇక మరో భారత సంస్థ జైడస్ కాడిల్లా తయారు చేసిన వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించింది. ఆక్స్ ఫర్డ్, సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ రెండు, మూడవ దశ ట్రయల్స్ ను ఇండియాలో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ చేపట్టింది.
తమ వ్యాక్సిన్ ట్రయల్స్ పై గత నెలలో రిపోర్ట్ ను విడుదల చేసిన భారత్ బయోటెక్, జంతువులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, వాటిల్లో ప్రాణాంతక కరోనాను సమర్థవంతంగా ఎదిరించగల యాంటీ బాడీలు వృద్ధి చెందాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మూడవ దశ ట్రయల్స్ విజయవంతమైతే ఆ వెంటనే ఏ క్షణమైనా వ్యాక్సిన్ బాహ్య ప్రపంచంలోకి వచ్చేస్తుందని సంస్థ ఇప్పటికే వెల్లడించింది.
లాక్ డౌన్ పటిష్ఠంగా అమలవుతున్న దశలో, కోవాక్సిన్ ను ఆగస్టు 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పందిస్తూ, కరోనాకు వ్యాక్సిన్ కనీసం ఈ సంవత్సరం చివరివరకూ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వ్యాక్సిన్ క్యాండిడేట్లు వివిధ దశల ట్రయల్స్ లో ఉన్నాయి.