Kangana Ranaut: కంగనా రనౌత్ ను రేప్ చేస్తానంటూ న్యాయవాది పోస్ట్... వైరల్ కావడంతో ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారంటూ వివరణ!
- ప్రస్తుతం కంగనపై దేశద్రోహం కింద కేసు
- వ్యంగ్యంగా స్పందించిన కంగన
- లాయర్ నుంచి బెదిరింపు ట్వీట్
- ఖాతానే తొలగించిన న్యాయవాది
ఇప్పటికే తన వివాదాస్పద వ్యాఖ్యలతో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేనతో కయ్యం కొని తెచ్చుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఇప్పుడు పలు పోలీసు స్టేషన్లలో కేసులను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెపై ముంబై పోలీసులు దేశద్రోహం నేరాభియోగాలను కూడా మోపారు. దీనిపై కంగన వ్యంగ్యంగా స్పందించగా, ఆమెపై అత్యాచారం చేస్తానంటూ, ఓ న్యాయవాది ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ కపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
మహారాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన కంగన, "నవరాత్రి రోజుల్లో ఉపవాసం ఉన్నది ఎవరు? నేడు జరుగుతున్న వేడుకల ఫొటోల ఇవి. నా మీద మరో కేసు కూడా పెట్టారు. మహారాష్ట్రలో ఉన్నది పప్పు సేన. వారికి నాపై మక్కువ పెరిగిపోయినట్లుంది. నన్నేమీ మిస్ కావద్దు. త్వరలోనే ముంబైకి వస్తాను" అని ట్వీట్ పెట్టింది. ఆపై ఓ లాయర్ నుంచి బెదిరింపు ట్వీట్ రాగా, ప్రస్తుతం మనాలీలో ఉన్న కంగన, ఇంతవరకూ స్పందించలేదు.
అయితే, ఆ లాయర్, మరో పోస్ట్ ను పెడుతూ, తన ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, సదరు ట్వీట్ తాను పెట్టింది కాదని వివరణ ఇచ్చారు. తన ఖాతా నుంచి అసభ్యకరమైన పోస్టులు చేశారని, వాటిని చూసిన తరువాత తాను దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. తన ఖాతాలో ప్రత్యక్షమైన పోస్టుల కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే క్షమించాలని కోరుతూ, తన ఫేస్ బుక్ ఖాతాను ఆయన తొలగించడం గమనార్హం.
ఇదిలావుండగా, వ్యవసాయ చట్టాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని క్యతాసంద్ర పోలీసు స్టేషన్ లో ఓ కేసు కంగనపై నమోదైంది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ను కూడా రిజిస్టర్ చేశారు. తాజాగా, బాంద్రా న్యాయమూర్తి ఆదేశంతో దేశద్రోహం కేసు కూడా ఆమెపై రిజిస్టర్ అయింది.