Mutton: కేజీ మటన్ రూ.200 అనడంతో కృష్ణా జిల్లాలో ఎగబడిన ప్రజలు.. ఆధార్ తో లింకు!
- ఆధార్ ఉంటే తగ్గింపు ఆఫర్
- పక్కింటివాళ్ల ఆధార్ కార్డులు కూడా పట్టుకొచ్చిన జనం
- మరుసటి రోజు కూడా ఆఫర్ ఇవ్వలేదని జనాగ్రహం
ఏదైనా చవకగా వస్తుందంటే ఎవరు వదులుకుంటారు చెప్పండి! అది కూడా కిలో రూ.800 వరకు పలికే వేటమాంసం మరీ తక్కువ ధరకు లభిస్తుందంటే జనం ఊరుకుంటారా! కృష్ణా జిల్లాలో అదే జరిగింది. జి.కొండూరులో ఓ మటన్ వ్యాపారి సోమవారం నాడు కిలో రూ.200 అని బోర్డు పెట్టేసరికి జనాలు పోటెత్తారు. అయితే ఆధార్ కార్డు ఉన్నవారికే ఈ ఆఫర్ అని ప్రకటించినా, ప్రజలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు సరికదా... ఇరుగుపొరుగు వాళ్ల ఆధార్ కార్డులు పట్టుకొచ్చి వేటమాంసం కోసం బారులు తీరారు.
అయితే ఈ ఆఫర్ సోమవారం ఒక్కరోజు మాత్రమే అమలు చేశారు. ప్రజలు మాత్రం మంగళవారం కూడా భారీగా తరలిరాగా, పాత రేట్లకే మటన్ అమ్మారు. దాంతో మండిపడిన జనాలు... సోమవారం అమ్మిన మాంసం చచ్చిన గొర్రెలదంటూ ఆరోపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగాలతో చచ్చిన జీవాలను తెచ్చి అమ్మకాలను పెంచుకునే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనిపై అధికారులు విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా జిల్లాలో జి.కొండూరు ప్రాంతంలో అమ్మే వేటమాంసానికి జిల్లాస్థాయిలో మంచిపేరుంది. వ్యాపారుల మధ్య పోటీతోనే మాంసం ధరలు భారీగా తగ్గించినట్టు ఓ వాదన వినిపిస్తోంది.