ICMR: ఐదు నెలల్లో యాంటీబాడీలు తగ్గితే వారికి మళ్లీ కరోనా సోకే చాన్స్!
- ఆసక్తికర వివరాలు వెల్లడించిన ఐసీఎంఆర్
- కరోనా తగ్గినా మాస్కు తప్పనిసరిగా ధరించాలి
- ముంబయిలో రెండు రీఇన్ఫెక్షన్ కేసులు వచ్చాయని వెల్లడి
దేశంలో కరోనా పరిస్థితులపై ఐసీఎంఆర్ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ఒకసారి కరోనా సోకి, నయమైన వాళ్లకు కూడా మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో ఐదు నెలల్లోనే యాంటీబాడీలు తగ్గితే వారికి మరోసారి వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
అందుకే, ఒకసారి కరోనా నయమైనా గానీ మాస్కు ధరించడం తప్పనిసరి అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ఇలాంటి కేసులు ముంబయిలో రెండు, అహ్మదాబాద్ లో ఒకటి నమోదయ్యాయని వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ఇలాంటి రీ ఇన్ఫెక్షన్ కేసులు 24 నమోదయ్యాయని బలరాం భార్గవ వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.