Buggana Rajendranath: ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది: బుగ్గన
- ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ ఆర్థికమంత్రి
- కేంద్ర విమానయాన శాఖ మంత్రితో భేటీ
- రాష్ట్రం తరఫున విజ్ఞాపనలు సమర్పణ
ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞాపనలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలు వెల్లడించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కోరినట్టు తెలిపారు.
అంతేకాకుండా, ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు డీజీసీఏ, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అనుమతులు ఇవ్వాలని కోరామని, కేంద్రం నుంచి లైసెన్స్ ఫీజులు, ఇతర అంశాలపై మినహాయింపులు ఇవ్వాలని కోరామని బుగ్గన పేర్కొన్నారు. ఓర్వకల్లు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయిందని, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. విశాఖ విమానాశ్రయం నుంచి రావాల్సిన టెక్నాలజీపై కేంద్రమంత్రితో మాట్లాడినట్టు వివరించారు. ఓర్వకల్లులో తుది దశ పనులకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
ఓర్వకల్లు, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్రమంత్రి చెప్పారని బుగ్గన తెలిపారు. అటు, రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రానికి సిఫారసు చేయాలని నీతి ఆయోగ్ ను కోరతామని అన్నారు. యురేనియం, కిడ్నీ వ్యాధుల ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సాయం కోరతామని వివరించారు.