India: చైనాకు చెక్ చెప్పేందుకు... ఇండియా, యూఎస్, జపాన్ లతో కలిసిన ఆస్ట్రేలియా!

Australia Added this Year Malabar Navy Excercise

  • వచ్చే నెలలో మలబార్ నేవీ విన్యాసాలు
  • మళ్లీ వచ్చి చేరిన ఆస్ట్రేలియా
  • కొవిడ్ నిబంధనల మేరకు విన్యాసాలు

అరేబియా, బంగాళాఖాతంలో వచ్చే నెలలో జరిగే అత్యున్నత మలబార్ నావికాదళ విన్యాసాల్లో ఇండియా, యూఎస్, జపాన్ లతో పాటు ఆస్ట్రేలియా కూడా పాల్గొననుంది. సరిహద్దుల్లో చైనా రెచ్చిపోతున్న వేళ, ఈ విన్యాసాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని నాలుగు దేశాలూ నిర్ణయించాయి. ఇటీవలి కాలంలో సముద్రంపై మరింత ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుగు పొరుగున ఉన్న తైవాన్, హాంకాంగ్ లపైనా చైనా ప్రతాపం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతియేటా సైనిక పాటవ సత్తాను చాటే మలబార్ విన్యాసాల్లో నాలుగు దేశాల చతుర్ముఖ కూటమి పాల్గొనడం విశేషం.

వాస్తవానికి మలబార్ విన్యాసాలను 1992లో ఇండియా, యూఎస్ లు ప్రారంభించగా, ఆపై జపాన్ వచ్చి చేరింది. 2007లో ఆస్ట్రేలియా కూడా పాల్గొంది. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడంపై చైనా నుంచి తీవ్ర విమర్శలు రాగా, ఆ తరువాతి సంవత్సరం నుంచి ఆస్ట్రేలియా యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో భాగం పంచుకునేందుకు ఆసక్తి చూపలేదు. 2015 నుంచి జపాన్ వచ్చి చేరింది. కాగా, ఈ వార్షిక యుద్ధ విన్యాసాలు ఇండో పసిఫిక్ రీజియన్ పై ఆధిపత్యం కోసమేనన్నది చైనా వాదన.

ఇతర దేశాలతో స్నేహ బంధాలనే తాము కోరుకుంటున్నామని, మేరీటైమ్ సెక్యూరిటీ ఇండియాకు అత్యంత కీలకమని, అందువల్లే రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్ట్రేలియాను కూడా కలుపుకున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం జరిగే యుద్ధ విన్యాసాల్లో ఆస్ట్రేలియన్ నేవీ పాల్గొంటుందని స్పష్టం చేసింది. సముద్రంలో వార్ షిప్ లు భౌతిక దూరం పాటిస్తూ విన్యాసాలు చేస్తాయని, ఏ దేశం సైనికులు కూడా మరో దేశం సైనికులను కలవబోరని, ఈ మేరకు అన్ని కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించనున్నామని పేర్కొంది.

  • Loading...

More Telugu News