China Soldier: లడఖ్ లో పట్టుబడిన చైనా సైనికుడి వద్ద సైనిక పత్రాలు!
- ఎల్ఏసీ వద్ద చైనా సైనికుడ్ని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం
- సైనికుడ్ని చైనాకు అప్పగించనున్న భారత ఆర్మీ
- గూఢచర్యం కోణంలో విచారిస్తున్న నిఘా వర్గాలు
లడఖ్ సమీపంలోని దెంచోక్ ప్రాంతంలో ఓ చైనా సైనికుడు భారత బలగాలకు పట్టుబడిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సైనికుడి వద్ద సైనిక పత్రాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. సైనిక పత్రాలతో పాటు పౌర పత్రాలు కూడా అతడి వద్ద ఉన్నట్టు సమాచారం. చైనా సైన్యంలో కార్పొరల్ ర్యాంకు ఉన్న ఆ సైనికుడి పేరు వాంగ్ యా లాంగ్ అని తెలుసుకున్న భారత సైనికాధికారులు, అతడు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ లోని షాంగ్జిజెన్ పట్టణానికి చెందినవాడిగా గుర్తించారు.
అతడు చైనా సైన్యంలో ఆయుధాల మరమ్మతు నిపుణుడిగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం భారత ఆర్మీ కస్టడీలో ఉన్న ఈ సైనికుడ్ని తిరిగి చైనా సైన్యానికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, అతడి వద్ద పత్రాలు లభ్యమైన నేపథ్యంలో, గూఢచర్య మిషన్ లో భాగంగా అతడు ఎల్ఏసీ వద్దకు వచ్చాడేమోన్న కోణంలో భారత నిఘా వర్గాలు విచారణ సాగిస్తున్నాయి.