India: ఇండియన్ టూరిజం రంగానికి ప్రత్యేకంగా కేంద్రం ప్యాకేజీ!

Special Package for Indian Tourism

  • కుదేలైన పర్యాటక, ఆతిథ్య రంగాలు
  • హోటల్స్ కు వెళ్లేందుకు ప్రజల అనాసక్తి
  • కొత్త ప్యాకేజీని సిద్ధం చేస్తున్నాం
  • రెండు నుంచి మూడు నెలల్లో రెడీ
  • నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్

కొవిడ్-19 కారణంగా మార్చి నుంచి పర్యాటక, ఆతిథ్య రంగం కుదేలైన నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ రంగాలను గాడిలో పెట్టేందుకు కేంద్రం ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రంగాలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. మార్చి నాలుగో వారం నుంచి అన్ని పర్యాటక కేంద్రాలు, హోటల్స్ మూతపడ్డాయి. ఆ తరువాత నిబంధనలకు అనుగుణంగా అన్ లాక్ 4.0లో హోటల్స్ తిరిగి తెరచుకున్నా, వాటిల్లోకి వెళ్లే వారు కరవయ్యారు.

తాజ్ మహల్ నుంచి కన్యాకుమారి వరకూ అన్ని టూరిస్ట్ కేంద్రాలూ మూతబడ్డాయి. ఏపీలో అరకు, తలకోన, తెలంగాణలో గోల్కొండ కోట, చార్మినార్, ప్లానిటోరియం సందర్శన ఆగిపోయాయి. కేరళ, తమిళనాడు, గుజరాత్, యూపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా... తదితర అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కరోనా కారణంగా అత్యధికంగా నష్టపోయిన రంగాల్లో పర్యాటక, ఆతిథ్య రంగాలు నిలిచాయి. దీంతో నష్ట నివారణకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.

ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ కాంత్, పర్యాటక రంగం కోసం ఓ ఉద్దీపనను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. టూరిజం ఇండస్ట్రీతో పాటు రవాణా, హోటల్ విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంటుందని అన్నారు. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్) కోసం మరో ప్యాకేజీ సిద్ధమవుతోందని, ఇందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని ఆయన అన్నారు.

ఇదే సమయంలో రానున్న పర్వదినాల సీజన్ లో మధ్య తరగతి ప్రజలు ఏ మేరకు ఖర్చు చేస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొనివుందని, ఇదే ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం కీలకమని అమితాబ్ కాంత్ అంచనా వేశారు. సెప్టెంబర్ లో ప్రజల కొనుగోలు శక్తి 56.8 పాయింట్లకు పెరిగిందని వెల్లడించిన ఆయన, విమానయాన రంగంతో పాటు, రైల్వేల నుంచి మరింత ఆదాయం పొందేందుకు నూతన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News