Andhra Pradesh: ఏపీలో సినిమా థియేటర్లను తెరవడంపై యాజమాన్యాల కీలక నిర్ణయం
- రేపటి నుంచి థియేటర్లను తెరవడానికి కేంద్రం అనుమతి
- తెరవకూడదని ఏపీ థియేటర్ యాజమాన్యాల నిర్ణయం
- 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపలేకపోవడమే కారణం
అన్ లాక్-5లో భాగంగా రేపటి నుంచి సినిమా థియేటర్లను తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్ లను కూడా ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు, మల్టీప్లెక్స్ లను ఓపెన్ చేయాలని షరతు విధించింది.
ఈ నేపథ్యంలో ఏపీలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు ఈరోజు విజయవాడలో సమావేశమయ్యారు. రేపటి నుంచి థియేటర్లను ప్రారంభించాలా? వద్దా? అనే విషయంపై చర్చించారు. చివరికి థియేటర్లను తెరవకూడదని ఈ సమావేశంలో వీరు కీలక నిర్ణయం తీసుకున్నారు.
థియేటర్లు తెరవాలంటే ఒక్కోదాన్ని మళ్లీ రెడీ చేయడానికి రూ. 10 లక్షలు ఖర్చవుతుందని, దీనికితోడు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడపడం కూడా కష్టమేనని భావించి థియేటర్ల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.