Uddhav Thackeray: నా మత విశ్వాసాలను శంకించాల్సిన అవసరం లేదు: గవర్నర్ కు థాకరే ఘాటు సమాధానం
- నేను హిందుత్వను అనుసరిస్తాను
- లాక్ డౌన్ ను ఒకేసారి ఎత్తేయడం మంచిది కాదు
- నా హిందుత్వపై ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు
తాను హిందుత్వను అనుసరిస్తానని, తన మత విశ్వాసాలను శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలను తెరవడానికి సంబంధించిన అంశంపై ఆ రాష్ట్ర గవర్నర్ కోష్యారీ రాసిన లేఖపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ ను ఒక్కసారిగా విధించడం, ఒకేసారి ఎత్తివేయడం రెండూ మంచివి కాదని అన్నారు. తన హిందుత్వ గురించి తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పారు.
ప్రార్థనా స్థలాలను తెరుస్తున్నట్టు ప్రకటించాలంటూ ఉద్ధవ్ కు రాసిన లేఖలో గవర్నర్ కోష్యారీ సూచించారు. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలు తెరుచుకున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో ప్రార్థనాలయాలకు ఇంకా ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే నచ్చని మీరు సడన్ గా సెక్యులర్ గా మారిపోయారా? అని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారని అడిగారు. ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.
మరోవైపు దేవాలయాలను తెరవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ రోజు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయం వద్ద ఆందోళన చేపట్టిన బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షిరిడీ సాయిబాబా ఆలయం వద్ద కూడా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.