AP High Court: న్యాయమూర్తులను దూషించిన కేసును సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు
- న్యాయవ్యవస్థ, జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు
- తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
- సీబీఐకి సహకరించాలంటూ ఏపీ సర్కారుకు ఆదేశాలు
ఇటీవల సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అవాంఛనీయ రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. న్యాయమూర్తులపై దూషణలకు పాల్పడిన కేసును తాజాగా సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 8 వారాల్లోగా నివేదిక అందజేయాలని ఏపీ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కూడా జడ్జిలపై వ్యాఖ్యలు చేసినవారిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా, ఈ దర్యాప్తులో సీబీఐకి సహకరించాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
న్యాయ వ్యవస్థలపైనా, న్యాయమూర్తులపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెరిగిపోతుండడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇటీవల కొన్ని ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో జడ్జిల పట్ల అవమానకర రీతిలో పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపైనా న్యాయస్థానం దృష్టి సారించింది. స్పీకర్ న్యాయవ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారించక తప్పదని హెచ్చరించింది.