Idly: 'ఇడ్లీ'పై అనుచిత వ్యాఖ్య... బ్రిటన్ ప్రొఫెసర్ పై సోషల్ మీడియా వార్!
- ఇడ్లీ చాలా బోరింగ్ విషయమన్న ప్రొఫెసర్ ఆండర్సన్
- ఆయనకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన విమర్శలు
- ఇడ్లీ తినాలంటే పెట్టి పుట్టాలన్న శశిథరూర్
- 'ఓట్ ఫర్ ఇడ్లీ' హ్యాష్ ట్యాగ్ వైరల్
పొద్దున్నే అల్పాహారంగా ఏం తీసుకుంటారని దక్షిణ భారతీయులను అడిగితే, అత్యధికులు చెప్పే సమాధానం... ఇడ్లీ. తేలికగా అరగడంతో పాటు ఎన్నో పోషకాలను శరీరానికి అందించే ఇడ్లీని ఎన్నో రకాల చట్నీలు, సాంబార్, రసం తదితరాలతో రుచిగా మార్చుకుని లొట్టలేసుకుంటూ తినేవారు కోట్ల మంది ఉన్నారు. అటువంటి ఇడ్లీని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటారా? ఇప్పుడదే జరిగింది.
ఇంతకీ ఏమైందని అనుకుంటున్నారా? ఓ ఫుడ్ సప్లయ్ యాప్ సరదాగా ఓ ప్రశ్నను సంధించింది. 'ప్రజలు ఈ ఆహారాన్ని ఇంతలా ఎందుకు ఇష్టపడుతున్నారు?' అనిపించే ఒక ఆహార పదార్థం పేరు చెప్పమని కోరింది. దీనికి బ్రిటన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి స్పందిస్తూ... 'ప్రపంచంలోనే అత్యంత బోరింగ్ ఇడ్లీ' అంటూ కామెంట్ చేశారు.
అంతే, దక్షిణాది ఇడ్లీ ప్రియులంతా అతనిపై విరుచుకుపడ్డారు. ఇడ్లీ రుచిని, దాని ప్రత్యేకతను వివరిస్తూ కామెంట్లు పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం సదరు ప్రొఫెసర్ ట్వీట్ పై స్పందించారు. ఇడ్లీని తిని, దాని రుచిని ఆస్వాదించాలన్నా, క్రికెట్ మ్యాచ్ ని మైదానంలో కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేయాలన్నా పెట్టి పుట్టాలని వ్యాఖ్యానించారు. నిజమైన జీవితం ఏంటో ఆ ప్రొఫెసర్ కు తెలియదని, ఆయన్ను చూస్తే, తనకు జాలేస్తోందని కామెంట్ పెట్టారు.
లక్షల మంది తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటాన్ని చూసిన ప్రొఫెసర్ దిగొచ్చారు. తాను అనుకోకుండా తప్పు చేశానని అంటూ, క్షమాపణలు కోరారు. తన లంచ్ కి ఇడ్లీని ఆర్డర్ చేశానని చెప్పి, ఆ ఫోటోలు షేర్ చేశారు. తన భార్య కేరళకు చెందిన యువతేనని అన్నారు. తనకు దక్షిణ భారత వంటకాలంటే ఇష్టమేనని అంటూనే... ఇడ్లీపై తన అభిప్రాయంలో మార్పు రాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో రగడ మరింతగా పెరిగింది. ట్విట్టర్ లో ఇప్పుడు 'ఓట్ ఫర్ ఇడ్లీ' హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుండగా, ప్రొఫెసర్ ఆండర్సన్ ను అందరూ కలిసి ఏకేస్తున్నారు.