Cyclone: నేటి రాత్రి నరసాపురం, విశాఖ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం

IMD upgrades watch in Bay to deep depression

  • తీరాన్ని దాటే సమయంలో 75 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • ఉభయ గోదావరి, విశాఖకు హెచ్చరిక
  • మరో వారం పాటు నైరుతి రుతుపవనాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని, అనంతరం నేటి రాత్రి నరసాపురం, విశాఖపట్టణం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

వాయుగుండం నిన్న సాయంత్రానికి గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతూ విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు, కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 370 కిలోమీటర్లు, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.

నేటి రాత్రి ఇది తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. తీరంలోని పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేశామని, మత్స్యకారులు ఎవరూ వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.

వాయుగుండం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావం మరో వారం రోజులపాటు ఉంటుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 14న ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News