Madhya Pradesh: ఓటేయాలని మోకాళ్లపై కూర్చుని వేడుకున్న మధ్యప్రదేశ్ సీఎం!
- నవంబర్ లో 28 నియోజకవర్గాలకు ఎన్నికలు
- ప్రజలను ఓటేయాలని వేడుకున్న శివరాజ్ సింగ్
- హామీలు నెరవేరిస్తే, ఇంత పరిస్థితి రాబోదన్న కాంగ్రెస్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ లో ఉప ఎన్నికలు జరుగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్ దీప్ సింగ్ డాంగ్ ను ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నిలిపింది. ఆయనకు మద్దతుగా ప్రచారం కోసం వచ్చిన శివరాజ్ సింగ్, ప్రజల ముందు మోకాళ్లపై నిలబడి, తలవంచి, ఆయనకు ఓటేయాలని అభ్యర్థించారు.
శివరాజ్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. మాజీ సీఎం కమల్ నాథ్ స్పందిస్తూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని, ప్రజలను వంచించకుండా ఉంటే, ఇలా మోకాళ్లపై కూర్చుని ఓట్ల కోసం అభ్యర్థించాల్సిన అవసరం లేదని అన్నారు. హామీలను నెరవేరిస్తే, ప్రజలు వాళ్లంతట వాళ్లే ఓట్లు వేస్తారని అన్నారు. కమల్ నాథ్ విమర్శలపై బీజేపీ సైతం దీటుగా స్పందించింది. కొందరు దేశ ప్రజల ముందు తల వంచుతారని, అదేమీ తప్పుకాదని, మరికొందరు మాత్రం ఇటలీ ముందు తల దించుకుని ఉంటారంటూ చురకలు వేసింది.