Louise Gluck: సాహిత్యంలో అమెరికా కవయిత్రి లూయిస్ గ్లక్ కు నోబెల్ బహుమతి
- సాహిత్యంలో నోబెల్ ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ
- అనేక కవిత సంకలనాలతో గుర్తింపు తెచ్చుకున్న లూయిస్ గ్లక్
- యేల్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్న గ్లక్
అమెరికాకు చెందిన సుప్రసిద్ధ కవయిత్రి లూయిస్ గ్లక్ అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ ప్రైజు గెలుచుకున్నారు. సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లూయిస్ గ్లక్ కు ప్రకటించింది. వ్యక్తిగత ఉనికిని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో లూయిస్ గ్లక్ కఠిన సౌందర్యాన్ని సైతం ఎంతో నిక్కచ్చిగా తన కవితా గళం ద్వారా చాటారని రాయల్ స్వీడిష్ అకాడమీ ఓ ప్రకటనలో పేర్కొంది.
సమకాలీన అమెరికన్ సాహిత్య ప్రపంచంలో ప్రముఖ రచయిత్రిగా పేరెన్నికగన్న లూయిస్ గ్లక్ యేల్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆమె 1943లో న్యూయార్క్ లో జన్మించారు. ప్రస్తుతం మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్ లో నివసిస్తున్నారు.
1992లో ఆమె వెలువరించి 'ది వైల్డ్ ఐరిస్' కవితా సంకలనం సాహితీప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. 2006లో 'అవెర్నో', 2014లో వచ్చిన 'ఫెయిత్ ఫుల్ అండ్ విర్చువస్ నైట్' సంకలనాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.