Telangana: కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి.. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్
- ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్ష
- ఈ ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని వ్యాఖ్య
దుబ్బాక ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌లో ఇది కొంచెం జోష్ పెంచే వార్తే. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీపీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించని నేపథ్యంలో శ్రీనివాసరెడ్డికి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడవచ్చని చెబుతున్నారు.
చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పార్టీలో చేరిక సందర్భంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాజకీయాలు దారుణంగా దిగజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి సహకరించాలని కార్యకర్తలను కోరారు. నేటి నుంచి నవంబరు 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటానన్నారు.
దుబ్బాక అభ్యర్థిని తానే అనుకుని ఓటువేయాలన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకంటూ వ్యక్తిత్వం ఉండదా అని ప్రశ్నించారు. దుబ్బాక ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని, ఈ ఎన్నిక ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాలని ఉత్తమ్ కోరారు.