KCR: ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ వ్యవహరిస్తే కుదరదు: నదీజలాలపై కేసీఆర్ హెచ్చరిక
- కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులు ఆపాల్సిందే
- లేదంటే అలంపూర్-పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మిస్తాం
- రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయం
- తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ వ్యవహరించొద్దు
కృష్ణా నదిపై పోతిరెడ్డుపాడుతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను ఏపీ సర్కారు ఆపాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులు ఆపకపోతే అలంపూర్-పెద్దమారూర్ వద్ద ఆనకట్ట నిర్మిస్తామని తెలిపారు.
దీని ద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేలా ఏపీ వ్యవహరించకూడదని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు ఏపీ వ్యవహరిస్తే కుదరదని ఆయన అన్నారు. తెలంగాణ నీటి వాటాను కొల్లగొట్టాలని చూడొద్దని చెప్పారు. ఇరు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.