Urmila Gajapathiraju: ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఏడాదిగా ప్రయత్నిస్తున్నా దొరకడంలేదు: ఊర్మిళ గజపతి
- చర్చనీయాంశంగా మారిన ఎంఆర్ కాలేజి ప్రైవేటీకరణ
- ఇది సరైన నిర్ణయం కాదన్న ఊర్మిళ గజపతిరాజు
- కళాశాల ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వానికి వినతి
ఇటీవల కొంతకాలంగా విజయనగరం పూసపాటి గజపతిరాజుల కుటుంబ వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు బాధ్యతలు చేపట్టడం మొదలు నిత్యం ఏదో ఒక అంశం మీడియాలో వినిపిస్తూనే ఉంది. గత కొన్నిరోజులుగా మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కాలేజ్) ప్రైవేటీకరణ అంశం చర్చకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతిరాజు మీడియా ముందుకు వచ్చారు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు. కొందరు తన తాత, తండ్రి పేరుప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కళాశాలను ప్రైవేటీకరించాలని పూనుకోవడం బాధాకరమని, ఈ కాలేజిలో చదువుకున్న వారు దేశవిదేశాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఘనచరిత్ర ఉన్న కాలేజిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామంటే తాము అంగీకరించబోమని ఊర్మిళ గజపతిరాజు అన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ అంశంపై మాట్లాడేందుకు ఏడాది కాలంగా సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా దొరకడంలేదని విచారం వ్యక్తం చేశారు. మహారాజా కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ప్రతిపాదనలు విరమించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.