Shiv Sena: సుశాంత్ మృతిపై నివేదిక ఇచ్చిన డాక్టర్‌కు మా పార్టీతో సంబంధాలు లేవు: సంజయ్ రౌత్
- ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు డాక్టర్ సుధీర్ గుప్తా నివేదిక
- గతంలో మరోలా మాట్లాడిన సుధీర్
- తాజాగా ఆత్మహత్యే అని నివేదిక
- విమర్శలపై స్పందించిన శివసేన నేత సంజయ్
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడికల్ బోర్డు డాక్టర్ సుధీర్ గుప్తా ఇటీవల తన నివేదికలో అది హత్య కాదని, ఆత్మహత్యే అని తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులపై కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని, కుట్ర పూరితంగానే తప్పుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సుశాంత్‌ది ఆత్మహత్యేనంటూ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ కు తమ పార్టీతో రాజకీయ సంబంధాలు లేవని సంజయ్ రౌత్ తెలిపారు. సీబీఐ నివేదిక ప్రకారం సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలిందని ఆయన చెప్పారు. ఈ కేసులో సీబీఐ ఇచ్చిన నివేదికను నమ్మకపోతే ఎలా అని ఆయన నిలదీశారు.
కాగా, సుశాంత్ మృతి గురించి గతంలో డాక్టర్ సుధీర్ ఒకలా మాట్లాడి, ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఓ మీడియా సంస్థ ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహం శవపరీక్షకు సంబంధించి గతంలో కూపర్ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చారు.
అయితే, ఐదుగురు సభ్యుల టీమ్‌లో ఒక్కరు మాత్రమే జూనియర్ స్థాయి ఫోరెన్సిక్ డాక్టర్ ఉన్నారని ఆ మీడియా సంస్థ తెలిపింది. మిగతా నలుగురు కూడా వైద్య అధికారులు మాత్రమేనని, ఇందులో ఫోరెన్సిక్ నిపుణులు లేరని ఆ ప్యానల్‌ను గతంలో డాక్టర్ సుధీర్ తప్పుపట్టారు. ఇప్పుడు ఆయనే స్వయంగా సుశాంత్‌ది ఆత్మహత్య అని నిర్ధారించారు.