EAMCET: కరోనా కారణంగా ఎంసెట్ రాయని విద్యార్థులకు మరో అవకాశం
- ఇటీవలే తెలంగాణలో ఎంసెట్ నిర్వహణ
- కరోనాతో కొందరు గైర్హాజరు
- ఈ నెల 8న ప్రత్యేక ఎంసెట్
- 5వ తేదీ అర్ధరాత్రి లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన
ఇటీవలే తెలంగాణలో ఎంసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా సోకిన కొందరు విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకాని విషయాన్ని గుర్తించిన అధికారులు వారికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబరు 14 లోపు కరోనా పాజిటివ్ వచ్చి పరీక్ష రాయని విద్యార్థుల కోసం ఈ నెల 8న ప్రత్యేకంగా ఎంసెట్ నిర్వహిస్తున్నట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే తమ కరోనా పాజిటివ్, నెగెటివ్ సర్టిఫికెట్లతో పాటు హాల్ టికెట్ ను కూడా ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోగా ఈమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ఎంసెట్ వెబ్ సైట్ లో కరోనా అండర్ టేకింగ్ ఫామ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పరీక్ష కేంద్రం, సీబీటీ స్లాట్ బుక్ చేసి ఆ సమాచారాన్ని వారికి తెలియజేస్తామని ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.