Reliance: జియో తరువాత రిలయన్స్ రిటైల్ కు మహర్దశ... మరో రూ. 7,350 కోట్ల పెట్టుబడి!
- ఇన్వెస్ట్ చేసిన జీఐసీ, టీపీజీ
- రెండు సంస్థలకూ 1.63 శాతం వాటా
- వెల్లడించిన రిలయన్స్ ఇండస్ట్రీస్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ జియో కాపిటల్ లో లాక్ డౌన్ సమయంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో అందరికీ తెలిసిందే. దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ఇన్వెస్ట్ మెంట్స్ రావడంతో, మాతృసంస్థ విలువతో పాటు, అంబానీ ఆస్తుల విలువ సైతం గణనీయంగా పెరిగిపోయింది. ఇప్పుడు తాజాగా రిలయన్స్ మరో అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. జీఐసీ, టీపీజీ సంస్థల నుంచి రిటైల్ విభాగంలోకి రూ. 7,350 కోట్లు వచ్చినట్టు రిలయన్స్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
జీఐసీ 1.22 శాతం వాటాను కొనుగోలు చేస్తూ, రూ.5,512.50 కోట్లను, టీపీజీ 0.41 శాతం వాటా నిమిత్తం రూ. 1,837.50 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించాయి. ఇటీవల 1.40 శాతం వాటాను కొనుగోలు చేస్తూ, అబూదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఇన్వెస్ట్ మెంట్ సంస్థ ముబాదలా ఇన్వెస్ట్ మెంట్ కంపెనీ రూ. 6,247.50 కోట్లను పెట్టుబడిగా పెట్టగా, ఆపై సిల్వర్ లేక్ రూ.1,875 కోట్లను, జనరల్ అట్లాంటిక్ రూ. 3,675 కోట్లను ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరో యూఎస్ సంస్థ కేకేఆర్ అండ్ కో సైతం రూ. 5,500 కోట్లను రిలయన్స్ రిటైల్ విభాగంలో పెట్టుబడిగా పెట్టింది. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ కు దేశవ్యాప్తంగా 12 వేల స్టోర్లు ఉండగా, దాదాపు 64 కోట్ల మందికి ఇప్పటికే చేరువైంది. ఇండియాలోని అతిపెద్ద, అత్యధిక లాభాల్లో ఉన్న రిటైల్ బిజినెస్ గా రిలయన్స్ రిటైల్ ఉండటం, ఈ రంగంలో ఎదుగుదలకు భారత్ లో అపారమైన అవకాశాలు ఉండటంతోనే పలు విదేశీ సంస్థలు పెట్టుబడుల వరదను పారిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా, మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.59 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ ను నమోదు చేసిన రిలయన్స్ రిటైల్, రూ. 71,446 కోట్ల నగదు లాభాన్ని, రూ. 39,880 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదిలావుండగా, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ రూ. 3,700 కోట్లను పెట్టుబడిగా పెట్టి ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ స్థాపించిన 'ఇన్విట్' (ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ ట్రస్ట్)లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.