PUBG: యాజమాన్య హక్కులు మారినంత మాత్రాన పబ్జీ గేమ్ స్వభావం మారదు: కేంద్రం

Centre not keen on comeback of PUBG in India
  • ఇటీవల పబ్జీపై కేంద్రం నిషేధం
  • టెన్సెంట్ నుంచి హక్కులు వెనక్కి తీసుకున్న మాతృసంస్థ
  • పబ్జీపై ఫిర్యాదులు ఉన్నాయన్న కేంద్రం
పబ్జీ గేమ్ కు భారత యువతలో ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గేమ్ తో అనేక దుష్పరిణామాలు కూడా కలుగుతున్నాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే పబ్జీ సహా 118 చైనా యాప్ లపై కేంద్రం నిషేధాజ్ఞలు విధించింది. వాస్తవానికి పబ్జీ మాతృసంస్థ చైనాకు చెందినది కాదు. చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీకి పబ్జీ గేమ్ హక్కులను ప్రాంతాలవారీగా అప్పగించారు. ఆ విధంగా టెన్సెంట్ కంపెనీ భారత్ లో పబ్జీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఇటీవలే కేంద్రం పబ్జీపై నిషేధం విధించడంతో టెన్సెంట్ నుంచి పబ్జీ మాతృసంస్థ యాజమాన్య హక్కులను తిరిగి తీసుకుంది. దాంతో భారత్ లో పబ్జీ పునరాగమనానికి మార్గం సుగమం అయినట్టేనని అందరూ భావించినా, కేంద్రం మాత్రం దీనిపట్ల సుముఖంగా లేదు. పబ్జీ గేమ్ కోసం ఎందుకంత తొందర అంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రశ్నిస్తోంది.

గతంలో ఈ గేమ్ పై అనేక ఆరోపణలు వచ్చాయని, ఇది వ్యక్తుల్లో హింసాత్మక ప్రవృత్తిని ప్రేరేపించేదిగా ఉందని ఫిర్యాదులు కూడా అందాయని తెలిపింది. ఇప్పుడు యాజమాన్య హక్కులు మారినంత మాత్రాన పబ్జీ గేమ్ స్వభావంలో మార్పులేవీ రావు కదా అని పేర్కొంది.
PUBG
Comeback
India
China
Tencent

More Telugu News