MS Dhoni: మా ఓటమికి కారణం ఇదే: ధోనీ విశ్లేషణ

Dhoni Reviews Defeat in Yesterdays Match

  • 14 రోజుల క్వారంటైన్, ఆటగాళ్లకు కరోనా
  • తగినంత ప్రాక్టీస్ లేకపోయింది
  • ఏడాదిగా నేను బ్యాట్ పట్టలేదు

తొలి మ్యాచ్ లో గత సంవత్సరపు విజేత ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, అదే ఊపుతో రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్, 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ పై స్పందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, తమ ఓటమికి కారణాలను విశ్లేషించాడు. 217 పరుగులు అసాధ్యమైన లక్ష్యమేమీ కాదని వ్యాఖ్యానించిన ఆయన, 14 రోజుల క్వారంటైన్ తమ సన్నద్ధతపై ప్రభావం చూపిందని అన్నాడు.

తమకు సాధన చేసేందుకు అవసరమైన సమయం దొరకలేదని, ముఖ్యంగా తాను, గడచిన ఏడాదిగా ఆడకపోవడంతోనే లోయర్ ఆర్డర్ లో వస్తున్నానని చెప్పాడు. జట్టులో ఇద్దరు ఆటగాళ్లతో పాటు 13 మందికి కరోనా రావడం ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో యువ ఆటగాడు శామ్ కరణ్ తో పాటు రవీంద్ర జడేజాను ముందు పంపిస్తూ, ధోనీ ఆరో స్థానంలో దిగుతున్న సంగతి తెలిసిందే.

నిన్నటి మ్యాచ్ లో సైతం ధోనీ మునుపటి ఊపును చూపలేకపోయాడు. అద్భుతమైన ఫినిషర్ గా, టాప్ నుంచి లోయర్ ఆర్డర్ వరకూ ఎక్కడైనా ఆడే సమర్ధత ఉన్న ఆటగాడిగా గుర్తింపున్న ధోనీ, చివరి ఓవర్లో మాత్రమే మూడు సిక్స్ లు బాది, తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటాడు. అయినా, ఈ మ్యాచ్ లో ధోనీ ఆట సీఎస్కేను విజయ తీరాలకు చేర్చలేకపోయింది. ధోనీ మరో ఓవర్ ముందే తన బ్యాట్ ను ఝళిపిస్తే బాగుండేదని సీఎస్కే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News